🔸‘మెత్తగా ఉన్నానని అనుకుంటున్నారా.. అందరికీ మల్లన్న సినిమా చూపిస్తా’
🔸22ఏ రద్దు చేయాలి.. లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదు
🔸శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఫైర్
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసింది ఏమిటని బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని, ప్రజా సమస్యలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా శామీర్‌పేట్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రజల భూములకు 22ఏ సంకెళ్లు!
22ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల భూములకు సంకెళ్లు వేసిందని మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల సమస్యలతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే 22ఏను రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూరియా కొరత కనిపిస్తోందని, రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
అందరికీ సినిమా చూపిస్తా’
తాను మెత్తగా ఉంటానని ఎవరూ పొరబడవద్దని ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులకు ఘాటు హెచ్చరిక చేశారు.“మల్లారెడ్డి మెత్తగా ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు అందరికీ సినిమా చూపిస్తా. మల్లన్న సినిమా ఎలా ఉంటుందో చూపిస్తా” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మేడ్చల్ జిల్లాలో జరగనున్న మూడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు రాజకీయంగా చుక్కలు చూపిస్తామని సవాల్ విసిరారు. మాటలు చెప్పడం కాదు.. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలుస్తుందని హెచ్చరించారు.
🔸కేతమ్మ మాస్ వార్నింగ్
శామీర్‌పేట్ సమావేశంలో జవహర్‌నగర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు కేతమ్మ కాంగ్రెస్ నాయకులకు ఘాటు హెచ్చరిక చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్లిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తోందని ఆరోపించారు.
ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు ఇక సాగవని, కాంగ్రెస్ నాయకులు తమ వైఫల్యాలకు సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే సరైన రాజకీయ గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి, మాజీ ఎంపీపీ ఎల్లుభాయి, మాజీ జెడ్పీటీసీ అనిత, తూంకుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వర్ రావు, బీఆర్ఎస్ నాయకులు జహంగీర్, శ్రీనివాస్ రెడ్డి, కేతమ్మ, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

