🔸తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: డైరెక్టర్ జంగారెడ్డి
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయ సీఎంఆర్ఐటీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంఆర్ గ్రూప్ సెక్రటరీ గోపాల్ రెడ్డి సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ జంగారెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే విశిష్టమైన పండుగ అని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలనే దైవంగా భావించి జరుపుకునే ఈ పండుగ మనకు ప్రకృతితో మమేకమై జీవించడం నేర్పుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు కళాశాలలో ఇలాంటి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సమష్టిగా పనిచేసే నైపుణ్యాలు పెంపొందుతాయని వివరించారు. విద్యార్థినులు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. డీజే పాటలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

