ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన “ఆశీర్వాద దీప” కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దీపం వెలిగించి ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, భారతజాతి గర్వించే బిడ్డ, ఆకలిని, దుఃఖాన్ని తనివితీరా అనుభవించిన నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీ, బస్తీ, గ్రామం, పట్టణంలో ప్రజలు తమ పిల్లల పుట్టినరోజులా మోడీ జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారన్నారు. 25 ఏళ్లుగా ఓటమి లేకుండా 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మూడోసారి దేశ ప్రధానిగా కొనసాగుతున్న మోడీని బీట్ చేసే నాయకుడు ఇంకా రాలేదని, ఆయన చేతిలోనే దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. మోడీ డిక్షనరీలో సండే లేదని, ఎవ్రీ డే మండే అన్నట్లు విరామం లేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. 10 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దుర్గంధపూరితంగా, దోమలు, పందికొక్కులతో ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి ఉండేదని, నేడు అమృత్ స్టేషన్ల పేరుతో జరుగుతున్న అభివృద్ధికి గతానికి పోలికే లేదన్నారు. జాతీయ రహదారులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి మోడీ హయాంలోనే సాధ్యమైందన్నారు. “నేను పాలకుడిని కాదు, సేవకుడిని” అని చెప్పుకునే మోడీ ఆయురారోగ్యాలతో ఉండి దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.
