ఆర్ జె న్యూస్, కుత్బుల్లాపూర్ : సుంకం చెల్లించని డిఫెన్స్ మద్యం అక్రమ రవాణాపై కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు కొరడా ఝళిపించారు. వెన్నెలగడ్డ చెరువు వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో 6.750 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇమ్మడి నవీన్ అనే వ్యక్తి వద్ద తొమ్మిది మద్యం సీసాలను గుర్తించి, కేసు నమోదు చేశారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.25 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడు సైనికపురి సమీపంలో నివసించే ఓ డిఫెన్స్ ఉద్యోగి నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మద్యం సరఫరా వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ? ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు ? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. డిఫెన్స్ మద్యాన్ని అనధికారికంగా కొనుగోలు చేయడం, రవాణా చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమ మద్యం విక్రయాలపై నిఘా కొనసాగిస్తామని తెలిపారు.
కుత్బుల్లాపూర్‌లో ఎక్సైజ్ అధికారుల దాడి.. డిఫెన్స్ మద్యం స్వాధీనం
RELATED ARTICLES
