ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమిని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల, కొంపల్లి-1 సీబీఎస్‌ఈ శాఖ విద్యార్థులు వినూత్నంగా, హృదయాన్ని హత్తుకునేలా నిర్వహించారు. రక్తసంబంధం లేకపోయినా మన జీవితాలను నిస్వార్థంగా కాపాడుతున్న వృక్షాలను అన్నయ్యలుగా భావించి వాటికి రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణకు అరుదైన సందేశాన్ని అందించారు.
“వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.. అన్నయ్యలా మనకు అండగా నిలుస్తాయి” అంటూ విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మనకు నీడనిచ్చి, స్వచ్ఛమైన గాలిని అందించి, జీవనానికి ఆధారంగా నిలిచే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.చెట్లకు రాఖీ కడుతున్న సమయంలో విద్యార్థుల్లో కనిపించిన ఆప్యాయత, ప్రకృతిపై వారి ప్రేమ చూపరులను ఆకట్టుకుంది. “ఈ రాఖీ బంధం చెట్టుతో కాదు.. మన భవిష్యత్తుతో” అంటూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. “వృక్షాలను రక్షిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల సహాయక సర్వసభ్య నిర్వాహకులు రవి, సమన్వయకర్తలు భూపతి, సోమేష్, ప్రధానోపాధ్యాయులు రాజేష్ రెడ్డి, నాగరాజు, అధ్యాపక విభాగాధిపతి వంశీధర్ రెడ్డి, ప్రాథమిక విభాగ బాధ్యురాలు వాసవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

