🔸నాణ్యతలో రాజీ పడొద్దు.. గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : రామంతాపూర్ పెద్ద చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి చెరువు వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకోవడంతో పాటు, పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలపై సమీక్షించారు. చెరువు పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. చెరువు పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
