ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ జోనల్ కమిషనర్ వికాస్ మహతోను కలిసి వినతిపత్రం అందజేసినట్లు స్థానిక నేత తెలిపారు. ప్రధాన రహదారులు ఎత్తుగా ఉండటం, అంతర్గత రహదారులు పల్లంగా ఉండటంతో వర్షం కురిసిన ప్రతిసారీ నీరు నిలిచిపోతోందని, దీనికి శాశ్వత పరిష్కారంగా కొత్త అంతర్గత రహదారులు నిర్మించాలని కోరారు. అలాగే నిలిచిపోయిన అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ మైదానంలో యువత కోసం క్రీడా సదుపాయాలు కల్పించాలని, బాస్కెట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ కోర్టులతో పాటు బహిరంగ వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భగత్‌సింగ్ నగర్, అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్ల కొరత ఉందని, వెంటనే నిర్మించాలని కోరారు. విజయ్‌పురి కాలనీ, వీఎం హోమ్‌ల్యాండ్ వద్ద బహిరంగ కాలువ, మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గతంలో మూసివేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక, జలమండలి అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని కోరగా, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై పరిశీలిస్తామని జోనల్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. డివిజన్‌లోని వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, వసతి గృహాల్లో అగ్నిమాపక భద్రత, పారిశుధ్య అనుమతులను తనిఖీ చేయాలని, కొన్నిచోట్ల ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా మూసివేసిన దారులను తెరిపించాలని కోరారు. పెద్ద అపార్ట్‌మెంట్లలో మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ ఏర్పాట్లు లేకుండానే భవన ప్రవేశ అనుమతులు ఎలా ఇస్తున్నారనే అంశంపై సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు.
సరూర్‌నగర్ డివిజన్ సమస్యలపై జోనల్ కమిషనర్‌కు వినతి
RELATED ARTICLES
