🔸 మెదక్ డీసీసీబీ మాజీ చైర్మన్ సహా 8 మంది అరెస్టు..!
🔸రూ.3.28 లక్షల నగదు, పేకముక్కలు, సెల్‌ఫోన్లు స్వాధీనం..!
మేడ్చల్ జిల్లా: కొంపల్లిలో పేకాట స్థావరంపై కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అపర్ణ సరీనిటీ అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ మాజీ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
🔸రెండోసారి పట్టుబడ్డారంటూ..
పేకాట ఆడుతూ దేవేందర్‌రెడ్డి పోలీసులకు పట్టుబడటం ఇది రెండోసారి అని సమాచారం. గతంలోనూ పేకాట వ్యవహారంలో ఆయన పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి పేకాట ఆడుతున్న సమయంలో ఎస్‌ఓటీ పోలీసుల దాడిలో పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
🔸రూ.3.28 లక్షలు స్వాధీనం
దాడిలో పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.3,28,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పేకాటకు ఉపయోగించిన పేకముక్కలు, సెల్‌ఫోన్లు తదితర సామగ్రిని సీజ్ చేశారు. పట్టుబడిన ఎనిమిది మందిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
🔸ఎవరి అండతో నిర్వహణ..?
అపార్ట్‌మెంట్‌లో పేకాట స్థావరం నిర్వహిస్తున్న విషయం స్థానికులకు తెలియకుండా ఎలా కొనసాగింది? ఇందులో నిర్వాహకుల పాత్ర ఏమిటి? పేకాట కోసం ప్రత్యేకంగా అపార్ట్‌మెంట్‌ను ఉపయోగిస్తున్నారా? అన్న కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పేకాట నిర్వహణ వెనుక మరెవరైనా ఉన్నారా? అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.పేకాట, జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
