ఆర్ జె న్యూస్,మేడ్చల్ : మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గెలాక్సీ టవర్స్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మౌనిక సంతోషి (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ఘటన వివరాలు
మృతురాలు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనిక. యాక్సిస్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వైజాగ్‌కు చెందిన రమాకాంత్‌ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. రమాకాంత్ ఇన్ఫోసిస్‌లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల కవల మగ పిల్లలు ఉన్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఘటన సమయంలో భర్త రమాకాంత్ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకి వచ్చిన పనిమనిషి మౌనిక ఉరి వేసుకున్న స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త వేధింపులే మృతికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, పోలీసులు దీనిపై ఎలాంటి నిర్ధారణ చేయలేదు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోచారం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తల్లిని కోల్పోయిన కవల చిన్నారులతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
