Tuesday, September 1, 2026
Homeమేడ్చల్ జిల్లాగోకరకుంట చెరువు భూమిపై ఆక్రమణల ఆరోపణలు

గోకరకుంట చెరువు భూమిపై ఆక్రమణల ఆరోపణలు

📰 Generate e-Paper Clip

🔸సర్వే నంబర్లు 3, 5, 6లో అక్రమ లేఔట్‌.. సర్వే నంబర్ 2 భూమిపైనా కబ్జా యత్నం

🔸కుంటలో మట్టి నింపి క్రికెట్ గ్రౌండ్, నిర్మాణాలు.. ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు?

🔸 అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం: దయానంద్ రెడ్డి, వెంకట్ రెడ్డి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ జిల్లా : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కీసర మండలం గోధుమకుంట గ్రామ పరిధిలోని గోకరకుంట చెరువు భూమి, దాని పరిసర సర్వే నంబర్లలో అక్రమ లేఔట్‌ కార్యకలాపాలు, ఆక్రమణలు జరుగుతున్నాయని సర్వే నంబర్ 2 భూమి యజమానులు సామల దయానంద్ రెడ్డి, వెంకట్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం జిల్లా ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కుంటకు సంబంధించిన సర్వే నంబర్ 4 రికార్డులను, సర్వే నంబర్ 3 రికార్డులను ఆధారంగా చేసుకుని సర్వే నంబర్లు 5, 6లలో హెచ్‌ఎండీఏ అనుమతులు లేకుండా ఓపెన్ ప్లాట్లుగా లేఔట్ చేస్తున్నారని వారు తెలిపారు. అంతేకాకుండా తమకు చెందిన సర్వే నంబర్ 2 భూమిలోకి సైతం అక్రమంగా చొరబడి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రశ్నించిన తమను తీవ్ర బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

🔸కుంటలో మట్టి నింపి క్రికెట్ గ్రౌండ్‌.. నిమ్మకు నీరెత్తినట్లు ఇరిగేషన్ శాఖ!

గోకరకుంట సర్వే నంబర్ 4 లో మట్టిని నింపి దాన్ని క్రికెట్ గ్రౌండ్‌గా మలిచి ఇతర నిర్మాణాలు చేపట్టినట్లు బాధితులు తెలిపారు. కుంట భూమిని గ్రౌండ్‌ కోసం వినియోగిస్తూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, మరొకవైపు అదే కుంట భూమికి సంబంధించి ‘రైతు బంధు’ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారని ఆరోపించారు. కళ్ల ముందే చెరువు ఆక్రమణకు గురవుతున్నా, మట్టి నింపి నిర్మాణాలు చేపడుతున్నా నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ అధికారులు ఏం చేస్తున్నారని, ఆక్రమణలను ఎందుకు అడ్డుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంటలో మట్టి నింపడం వల్ల గోకరకుంట సహజ స్వరూపం, నీటి నిల్వ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

🔸అధికారులకు ఫిర్యాదు.. స్పందించని యంత్రాంగం :

ఈ అక్రమాలపై ఇరిగేషన్ అధికారులతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి కి , జోనల్ కమిషనర్ రాధికా గుప్త కి , సర్కిల్ కమిషనర్ వాణి రెడ్డికి , ఆర్డీఓ నల్ల వెంకట్ రెడ్డి కి , తహసీల్దార్ యాదగిరి రెడ్డి కి , హైడ్రా, జిల్లా కలెక్టర్ తదితర అధికారులందరికీ లేఖల ద్వారా ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. సర్వే నంబర్లు 2, 3, 4, 5, 6లకు సంబంధించిన రెవెన్యూ, లేఔట్‌ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో భౌతిక హద్దులను గుర్తించాలని డిమాండ్ చేశారు.

🔸ప్రజలు మోసపోవద్దు.. తక్షణమే విచారణ జరపాలి :

అనుమతులు లేని అక్రమ లేఔట్లలో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసి పేద, మధ్యతరగతి ప్రజలు భవిష్యత్తులో మోసపోవద్దని హెచ్చరించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర ఎంక్వైరీ నిర్వహించాలని, అక్రమ లేఔట్‌ కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు గోకరకుంట చెరువు భూమిని, బాధితుల హక్కులను పరిరక్షించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!