ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : దోమల నివారణ చర్యల్లో భాగంగా మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు, కీసరపూర్ డివిజన్‌లోని రామేంద్ర కాలనీలో మంగళవారం రాత్రి ఫాగింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ అరుణ్ మాట్లాడుతూ.. డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ఆదేశాల మేరకు వర్షాకాలంలో దోమల వృద్ధిని అరికట్టేందుకు క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దోమలు, ఇతర కీటకాల నివారణకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.వర్షాల కారణంగా ఎక్కడపడితే అక్కడ నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, తద్వారా ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమల నివారణకు క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహిస్తామని ఏఈ అరుణ్ తెలిపారు.
