ఆర్.జె.న్యూస్, రాయదుర్గం : గచ్చిబౌలి అంజయ్య నగర్ లో నిర్మాణంలో ఉన్న G+6+పెంట్ హౌస్ భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనలో రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆగస్టు 22న మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో టైల్స్ పనులు చేస్తున్న ఉమేష్ కారే, మొహ్ పాల్ భలావి అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేవీ రమణారెడ్డి (75) కి తీవ్ర గాయాలు కాగా, పక్కన ఉన్న ఫ్లాట్ కు కూడా నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 945/2026 కింద కేసు నమోదైంది.
🔸బిల్డర్, కాంట్రాక్టర్ అరెస్ట్
ఈ కేసులో ప్రధాన నిందితుడైన భవన యజమాని/బిల్డర్ సయ్యద్ సజీద్ @ సయ్యద్ సాజిద్ ను ఆగస్టు 23న శంషాబాద్ లో అరెస్ట్ చేశారు. తాజాగా పరారీలో ఉన్న సహ నిందితుడు, కాంట్రాక్టర్ మొహమ్మద్ ఖాజా మియా @ ఖాజా మొయినుద్దీన్ (42) ను ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. గాజులరామారం కైసర్ నగర్ లోని అతని నివాసంలో అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.
🔸నాణ్యత లోపమే కారణం
పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి అధికారిక నిర్మాణ ఒప్పందం లేకుండానే భవన నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. సరైన భద్రతా చర్యలు పాటించకుండా నాణ్యత లేని నిర్మాణ సామగ్రిని వాడినట్లు తేలింది. ప్రమాదం జరిగిన రోజు ఉదయమే భవనంలో పగుళ్లు, ఫ్లోర్ కుంగిపోవడం గమనించినప్పటికీ కార్మికులను ఖాళీ చేయించకుండా, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయకుండా కాంట్రాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
