Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లారైతు సంఘాల ఎన్నికల నుంచి పారిపోతున్న...

రైతు సంఘాల ఎన్నికల నుంచి పారిపోతున్న కాంగ్రెస్ : బీజేపీ

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలో రైతు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేషన్ల ద్వారా పదవులను భర్తీ చేస్తోందని బీజేపీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లంపేట్ గౌరారం జగన్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేకే రైతుల ఓటు హక్కును హరిస్తున్నారని విమర్శించారు. రైతు సహకార సంఘాలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఆయన, ఎన్నికలను పక్కనపెట్టి డైరెక్టర్లు, చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లను నామినేట్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని అన్నారు. రైతులు తమ ప్రతినిధులను స్వయంగా ఎన్నుకునే అవకాశాన్ని దూరం చేసి, అధికారాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు కట్టబెట్టడం సరికాదని జగన్ గౌడ్ విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేకే ప్రభుత్వం ఈ విధానాన్ని అవలంబిస్తోందని ఆరోపించారు. రైతు సహకార సంఘాలు ఏ రాజకీయ పార్టీ పునరావాస కేంద్రాలు కావని, అవి రైతుల ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. రైతుల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్న ప్రభుత్వానికి రైతాంగం తగిన సమయంలో గుణపాఠం చెబుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రైతు సహకార సంఘాలకు వెంటనే స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రైతులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, మహిళలు సహా తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో తన పతనాన్ని తానే వేగవంతం చేసుకుంటోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన తీర్పు ఇస్తారని జగన్ గౌడ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!