Sunday, September 13, 2026
Homeతెలంగాణహైదరాబాద్ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

📰 Generate e-Paper Clip

🔸ఉప్పల్ భగాయత్‌లో ఆత్మగౌరవ భవన్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవారని, సమాజంలో గౌరవం కోసం జీవించే మనస్తత్వం వారిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్యుల్లో అనేక మంది పేదలు ఉన్నప్పటికీ ఆత్మగౌరవం కారణంగా పేదలుగా గుర్తింపు పొందేందుకు ఇష్టపడరని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, బండారి లక్ష్మారెడ్డి, ప్రకాశ్ గౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, మాజీ ఎంపీ మధు యాష్కీతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్రామాల్లో పేదలకు అవసరమైనప్పుడు అప్పుగా సరుకులు, ఆహారం అందించే వారిలో ఆర్యవైశ్య సోదరులు ముందుంటారని అన్నారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్యులేనని పేర్కొన్నారు. వ్యవసాయం, వ్యాపారం ప్రపంచంలో ప్రధానమైన రెండు వృత్తులని సీఎం వ్యాఖ్యానించారు.

రోశయ్యను గుర్తు చేసుకున్న సీఎం

తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడటానికి ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్య కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. శాసనమండలిలో తాను దూకుడుగా మాట్లాడుతున్న సమయంలో రోశయ్య తనను పిలిచి ఆవేశం తగ్గించుకుని అనుభవంతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి వస్తావని ఆశీర్వదించారని తెలిపారు.

“నన్ను ముందుగా గుర్తించింది రోశయ్యే” అని సీఎం అన్నారు. రోశయ్య విమర్శించే వ్యక్తి కాదని, తిట్టే వ్యక్తి కాదని.. చురకలు వేసే వారని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఆయన గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గాంధీ, పొట్టి శ్రీరాములు సేవలను ప్రస్తావించిన సీఎం

ఆర్యవైశ్యులను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారని సీఎం అన్నారు. ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందిన ఏకైక భారతీయుడు మహాత్మా గాంధీ అని, ఆయన ఆర్యవైశ్య బిడ్డ కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ గొప్పతనం తెలియని వారు ఉండరని అన్నారు.
దేశ సమగ్రత కోసం మహాత్మా గాంధీ ప్రాణత్యాగం చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించారని సీఎం గుర్తు చేశారు. అనేక మంది ఆర్యవైశ్య ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

రాజకీయాల్లో మీ వాటా తీసుకోండి

ఆర్యవైశ్యులకు రావాల్సిన గుర్తింపు ఇంకా పూర్తిస్థాయిలో రాలేదని సీఎం అన్నారు. తమ ప్రభుత్వానికి ఆర్యవైశ్యులపై సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. పేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఆత్మగౌరవ భవన్ ఉపయోగపడేలా చూడాలని, భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా ఉండాలని, “సమైక్యంగా ఒక్కతాటిపై నడిస్తేనే మీకు బలం, అందరూ గౌరవిస్తారు” అని సీఎం సూచించారు. ఇప్పటికే ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చామని, కొడంగల్‌లోని ఒక మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చామని గుర్తు చేశారు.
రాజకీయాల్లో ఆర్యవైశ్యులు తమ వాటాను తామే తీసుకోవాలని, ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!