ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : తెలంగాణ ప్రజలను నిజాం నవాబుల, రజాకార్ల అరాచకాల నుంచి, భూస్వాముల వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసిన ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ నేత బండారు రవి కుమార్ అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్లో గురువారం వీర తెలంగాణ సాయుధ పోరాటంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే అరుదైనదన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో వేలాది మంది ప్రజలు నిజాం నియంతృత్వాన్ని, రజాకార్ల అరాచకాలను తుదముట్టించి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టులదేనని కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేని వారు నేడు ఆ చరిత్రను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. భావి తరాలకు నిజమైన సాయుధ పోరాట చరిత్రను తెలియజేయాల్సిన బాధ్యత విద్యార్థులు, యువతపై ఉందన్నారు. సీపీఎం నేత సత్యం మాట్లాడుతూ, సాయుధ పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ భావజాలాన్ని నేటి తరం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమురయ్య, షేక్ బందగి, చిట్యాల ఐలమ్మ, బండి యాదగిరి వంటి వీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి నరేష్, జిల్లా కార్యదర్శి కార్తీక్, జిల్లా అధ్యక్షుడు అవినాష్, డీవైఎఫ్ఐ నాయకులు బాలకిరణ్, అరుణ్, శ్యామ్, వినయ్, ప్రేమ్, జీఎంపీఎస్ నాయకులు కొమురయ్య, సీఐటీయూ నాయకుడు నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

