ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జిల్లాలోని క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ల రిజిస్ట్రేషన్, రెన్యూవల్, తనిఖీలు, చట్టపరమైన నిబంధనల అమలుపై జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమీక్ష నిర్వహించింది. జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది.ఈ సందర్భంగా క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ల రిజిస్ట్రేషన్, రెన్యూవల్ ప్రక్రియ, తనిఖీలు, ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. తనిఖీల్లో సేకరించిన ఆధారాలు, పరిశీలించిన అంశాలు, తనిఖీ నిర్వహించిన అధికారుల వివరాలను నివేదికల్లో పూర్తిస్థాయిలో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.అవసరమైన సందర్భాల్లో రాత్రివేళల్లోనూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. 24 గంటల వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొంటున్న ఆసుపత్రులు, క్లినిక్‌లలో వాస్తవంగా సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా పరిశీలించాలని ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో ఓవర్ ద కౌంటర్ (OTC) మందుల విక్రయం, ప్రిస్క్రిప్షన్ నిబంధనలు, ఔషధ నియంత్రణ చట్టాల అమలును తనిఖీ చేయాలని సూచించారు.ప్రతి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో రిజిస్ట్రేషన్ వివరాలు, అందిస్తున్న వైద్య సేవలు, తప్పనిసరి డిస్‌ప్లే బోర్డులను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తప్పుడు ప్రకటనలు, హామీలు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు.వివిధ శాఖల నుంచి, ముఖ్యంగా పోలీస్ శాఖ ద్వారా వచ్చిన ఫిర్యాదులపైనా సమావేశంలో సమీక్షించారు. నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత చట్టాల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణహిత పద్ధతుల అమలుపైనా చర్చించారు. జిల్లాలో అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. చేపట్టిన చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్)లను సిద్ధం చేసి తదుపరి సమావేశంలో సమర్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆనంద్, ఏసీపీలు ఎస్.చక్రపాణి, శ్రీకృష్ణ ప్రసాద్, ఐఎంఏ అసోసియేషన్ సభ్యుడు వెంకటేశ్వరరావు, డిప్యూటీ డెమో వసంతకుమారి, వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

