🔸జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మ దహనం
🔸ఓటర్ల హక్కుల పరిరక్షణకు భారీ నిరసన
ఆర్ జె న్యూస్,మేడ్చల్ : ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పిలుపు మేరకు మంగళవారం మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ పేరుతో ఒక్క అర్హుడి ఓటు హక్కును కూడా తొలగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు, అనర్హుల పేర్ల చేర్పు వంటి అవకతవకలకు తావులేకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రక్రియలో జరిగిన ప్రతి అవకతవకను వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవసరమైతే మరింత పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌యాదవ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం, సీపీఐ మాస్‌లైన్ నాయకుడు సదానందం, టీజేఎస్ నాయకుడు లక్ష్మారెడ్డి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రవికుమార్, రామకాంత్‌రెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యూత్ కాంగ్రెస్, ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ, మహిళా కాంగ్రెస్ విభాగాల నాయకులు, అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
