ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండలం బహదూర్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ మను చౌదరి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, తరగతి గదులు, ప్రయోగశాలలు, మరుగుదొడ్ల వివరాలను ప్రిన్సిపల్ నాగేంద్రను అడిగి తెలుసుకున్నారు. కళాశాల మూడు ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతోందని ప్రిన్సిపల్ వివరించారు. ప్రస్తుతం ఉదయం ఇంటర్మీడియట్, మధ్యాహ్నం డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అదనపు తరగతి గదులు అవసరమని తెలిపారు. ప్రయోగశాలలు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు సరిపడా ఉన్నప్పటికీ మరో ఏడు తరగతి గదులు అవసరమని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటిని కళాశాల భవనం పై అంతస్తులో నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ మను చౌదరి సానుకూలంగా స్పందించారు. తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను పంపిస్తామని తెలిపారు. వారు పరిశీలన అనంతరం అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో దుండిగల్ మండల తహసీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

