ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : డబ్బులు చెల్లిస్తేనే నీటి కనెక్షన్ ఇస్తున్నారన్న ఆరోపణలు రావడంపై మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి స్పందించారు. ప్రజలకు అందాల్సిన మంచినీటిని వ్యాపారంగా మార్చొద్దని హెచ్చరించారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల డివిజన్ సూరజ్‌నగర్ కాలనీలో నెలకొన్న నీటి సమస్యను గురువారం ఆయన పరిశీలించారు. చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షుడు ఏర్పుల మహేష్‌తో కలిసి కాలనీలో పర్యటించిన ఆయన.. పలు వీధుల్లో పైప్‌లైన్ల పరిస్థితిని పరిశీలించారు. ముఖ్యంగా స్ట్రీట్ నంబర్–3 లెఫ్ట్‌సైడ్‌లో నీటి పైప్‌లైన్ సమస్యపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నీటి సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆయనకు వివరించారు. నీటి, నల్లా కనెక్షన్ల కోసం డబ్బులు అడుగుతున్నారన్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. “డబ్బులు ఇస్తేనే నీటి కనెక్షన్.. డబ్బులు ఇస్తేనే నీరు అనే పరిస్థితి ఉండకూడదు. ప్రజలకు సేవ చేయాల్సిన వ్యవస్థలో అక్రమ వసూళ్లకు తావులేదు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలి” అని అన్నారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ పరిధిలో నీటి కనెక్షన్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. సూరజ్‌నగర్ కాలనీలోని పైప్‌లైన్ సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించి, ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా అందించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే కాలనీ వాసులతో కలిసి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యే వరకు ప్రజల తరఫున పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో చెంగిచెర్ల డివిజన్ ఉపాధ్యక్షుడు గండుపల్లి రాజు, శ్రీనివాస్ గుప్తా, కాలనీ మాజీ జనరల్ సెక్రటరీ వి.ఎస్.ఎన్. చారి, రాజారెడ్డి, గుర్జాల రమేష్, రాజశేఖర్, కట్టల వెంకటేష్, శ్రీనివాస్, వెంకటస్వామి, జ్యోతి, రజిత తదితరులు పాల్గొన్నారు.
డబ్బులు ఇస్తేనే నీటి కనెక్షనా? ప్రజల మంచినీటిని వ్యాపారంగా మార్చొద్దు: ఏనుగు సుదర్శన్‌రెడ్డి
RELATED ARTICLES
