Friday, October 9, 2026
Homeమేడ్చల్ జిల్లాచినుకు కోసం.. చిగురుటాకులా రైతన్న ఆశ

చినుకు కోసం.. చిగురుటాకులా రైతన్న ఆశ

📰 Generate e-Paper Clip

🔸కళ్లముందే ఎండుతున్న పంటలు.. ట్యాంకర్ల నీటితో బతికించే ప్రయత్నం

🔸ఎల్లంపేట్ మున్సిపల్ రావల్ కోల్ గ్రామంలో అన్నదాత ఆవేదన

ఆర్ జె న్యూస్,మేడ్చల్‌ : ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు.. చినుకు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు.. కళ్లముందే పచ్చగా కళకళలాడాల్సిన పంట వాడిపోతుంటే కన్నీటిని దిగమింగుతున్నాడు. మేడ్చల్ మండలంలో రావలకోల్ గ్రామంలో అన్నదాతల పరిస్థితి ఇది. రైతు చెమట చిందించి పంట సాగు చేశాడు. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి ముఖం చాటేయడంతో ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. చినుకు పడక పొలాల్లోని పంటలు ఎండిపోతుండటాన్ని చూస్తూ ఆవేదన చెందుతున్నాడు.

పంటను బతికించేందుకు.. నీటి కోసం పరుగులు

పంటను ఎలాగైనా కాపాడుకోవాలన్న తపనతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పిస్తున్నారు. ఇప్పటికే సాగు కోసం పెట్టిన పెట్టుబడులకు తోడు ట్యాంకర్ల నీటి ఖర్చు అదనపు భారంగా మారింది. అయినా పంట ఎండిపోవడం చూడలేక అప్పులు చేసి మరీ నీటిని పోయిస్తున్నామని రైతులు చెబుతున్నారు.ఒకప్పుడు పంటకు నీరు పెట్టేందుకు రైతు పొలానికి పరుగెత్తేవాడు.. ఇప్పుడు నీటి కోసం ట్యాంకర్‌ వెంట పరుగెత్తాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆకాశం వైపు ఆశగా..

వర్షం పడితే పంట నిలబడుతుంది.. పంట నిలబడితే కుటుంబం నిలబడుతుంది. అందుకే ప్రతి మేఘాన్ని ఆశగా చూస్తున్నారు. మరికొన్ని రోజులు వర్షం కురవకపోతే పంట పూర్తిగా దెబ్బతింటుందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.రైతు తలారి నరసింహ, సన్నాపు భూమయ్య మాట్లాడుతూ.. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు అవసరమైన నీటి సదుపాయం కల్పించాలని కోరారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!