ఆర్ జె న్యూస్, మేడ్చల్ : జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రిపై కుమారుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సుత్తి, రోలుతో పలుమార్లు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు పవన్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. మాధురి నాగరాజు (53) వాచ్‌మన్‌గా పనిచేస్తుండగా, ఆయన కుమారుడు మాధురి పవన్ (25) కుటుంబ సభ్యులతో కలిసి ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో నివసిస్తున్నారు. పవన్ గత కొన్ని సంవత్సరాలుగా గంజాయికి బానిసయ్యాడని, గంజాయి సేవించవద్దని కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పినా వినేవాడు కాదని ఫిర్యాదుదారు మాధురి సుందర్ పేర్కొన్నారు. గతంలోనూ పవన్ తనపై దాడి చేసినట్లు తెలిపారు.
ఈ నెల 21న రాత్రి భోజనం అనంతరం నిద్రపోయిన సుందర్.. 22న తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిద్రలేచినప్పుడు పవన్ తనలో తాను మాట్లాడుకుంటూ నవ్వడం గమనించారు. అతడిని నిద్రపోవాలని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం తెల్లవారుజామున 3 నుంచి 3.30 గంటల మధ్య పవన్ తన తండ్రి నాగరాజుపై దాడి చేసినట్లు వారి తల్లి ఈశ్వరమ్మ వచ్చి సమాచారం ఇచ్చింది.వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. పవన్ తన తండ్రి ముఖంపై టీషర్టు కప్పి, సుత్తి, రోలుతో పలుమార్లు దాడి చేసినట్లు తెలిసిందని సుందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం పవన్ దుస్తులు తొలగించుకుని ఇంటి నుంచి పారిపోయినట్లు తెలిపారు.
రక్తపు మడుగులో పడి ఉన్న నాగరాజును చూసి వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సహాయంతో అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు చికిత్స పొందుతుండగా, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్లు ఫిర్యాదుదారు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన జవహర్‌నగర్ పోలీసులు పవన్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తన తండ్రిపై దాడి చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
అనంతరం పవన్‌ను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
