🔸రెండేళ్ల చిన్నారి స్నిగ్ధ మృతి
🔸కూకట్‌పల్లిలో విషాదం
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలితీసుకున్న విషాద ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్ పరిధిలోని ఎంఐజీ–69లో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, వారి రెండేళ్ల కుమార్తె స్నిగ్ధ సైతం మృతిచెందింది. చిన్నారి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపీనాథ్ (31) హోటల్ చెఫ్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య సమత (26) గృహిణి. వీరికి రెండేళ్ల కుమార్తె స్నిగ్ధ ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే దంపతులు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
గోడపై రాసిన సందేశం
తమ మరణానికి ఎవరూ కారణం కాదని, ఇతరులను ఈ ఘటనకు సంబంధించి వివరాలు అడిగి ఇబ్బంది పెట్టవద్దని దంపతులు గోడపై రాసినట్లు తెలిసింది. అయితే చిన్నారి స్నిగ్ధ ఎలా మృతిచెందిందనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారి మృతికి గల కారణాలతో పాటు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
