ఆర్ జె న్యూస్, మేడ్చల్, : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మెడిసిటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకారంతో పిల్లల తల్లులు, గర్భిణీలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లిపాల విశిష్టత, అవసరం, వాటిపై ఉన్న అపోహల నివృత్తిపై వైద్య నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా మెడిసిటి మెడికల్ డైరెక్టర్ డా. గీత మాట్లాడుతూ, శిశువుకు తల్లిపాలే అత్యంత సురక్షితమైన, సంపూర్ణమైన ఆహారమని పేర్కొన్నారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి–బిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని, ప్రతి తల్లి స్వయంగా పాలివ్వాలని సూచించారు.పీడియాట్రిక్ విభాగాధిపతి డా. సుదర్శన్ మాట్లాడుతూ, తల్లిపాలతో శిశువుకు పోషకాహారంతో పాటు కుటుంబ వారసత్వ అనుబంధం కూడా లభిస్తుందని తెలిపారు. తల్లిపాలపై ఉన్న అపోహలను నమ్మకుండా పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలే అందించాలని సూచించారు.అల్వాల్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ మాట్లాడుతూ, తల్లిపాలకు డబ్బా పాలు లేదా పశువుల పాలు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు.అనంతరం మెడిసిటి పీజీ విద్యార్థులు తల్లిపాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రత్యేక స్కిట్ ప్రదర్శించారు. తల్లిపాలు–డబ్బా పాల మధ్య తేడాలు, శిశువుకు పాలు పట్టించే సరైన విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం అనంతరం తల్లులు, గర్భిణీలకు పండ్లతో పాటు వేరుశనగ చిక్కీలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డా. గీత, డా. సుదర్శన్, డా. ఈనాక్షి గంగూలీ, డా. సమీర్, డా. శ్రీకాంత్, డా. నాగరాజు, మెడికల్ కళాశాల పీజీ విద్యార్థులు, వైద్యులు, పిల్లల తల్లులు, గర్భిణీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

