Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లామల్లారెడ్డీ.. దమ్ముంటే రాజీనామా చెయ్..!

మల్లారెడ్డీ.. దమ్ముంటే రాజీనామా చెయ్..!

🔸భూకబ్జా ఆరోపణలు నిరూపించు.. బాండ్‌పేపర్‌పై రాసిస్తా
🔸సీఎం పేరెత్తే అర్హత నీకు లేదు.. ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించేది లేదు:డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌యాదవ్‌

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ జిల్లా: తనపై, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న భూకబ్జా ఆరోపణలను డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు నిరూపించేందుకు ఆధారాలు తీసుకురావాలని సవాల్‌ చేశారు. శామీర్‌పేటలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మల్లారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
🔸 2005 తర్వాత నేను కొన్న ఆస్తులు చూపిస్తా..
2005 తర్వాత తాను, తన కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలన్నీ చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వజ్రేష్‌యాదవ్‌ అన్నారు. వాటిలో ఎక్కడైనా అక్రమంగా కబ్జా చేసిన భూమి ఉన్నట్లు నిరూపిస్తే బాండ్‌పేపర్‌పై రాసిచ్చి పేదలకు ఇచ్చేస్తానని ప్రకటించారు. అదే ధైర్యం మల్లారెడ్డికి ఉంటే తన ఆరోపణలను ఆధారాలతో నిరూపించి బాండ్‌పేపర్‌పై రాసివ్వాలని సవాల్‌ చేశారు.
🔸 బొమ్మరాసిపేటతో నాకేం సంబంధం?
బొమ్మరాసిపేట భూముల వ్యవహారంతో తనకు, ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే 2023లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆ భూముల సమస్య ఏర్పడిందని ఆరోపించారు. పేదల భూముల జోలికి ఎవరు వచ్చినా తాము ఊరుకునేది లేదన్నారు. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పేదల భూములకు అన్యాయం జరిగితే అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
🔸 నాపై ఒక్క ఆధారం చూపు తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేర్ల మీద బొమ్మరాసిపేటలో ఎక్కడైనా భూమి ఉందని, కబ్జా చేసినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు జిల్లా మొత్తం భూములు కబ్జా చేశారంటూ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని అన్నారు. ఆరోపణలు చేయడం సులువేనని.. వాటిని నిరూపించే ధైర్యం ఉండాలని వ్యాఖ్యానించారు.
🔸 దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చెయ్‌
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉందని, మల్లారెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని వజ్రేష్‌యాదవ్‌ సవాల్‌ విసిరారు. ప్రజల వద్దకు వెళ్లి ఎవరి పనితీరు ఏంటో తేల్చుకుందామని అన్నారు. ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారని చెప్పారు.
🔸 ప్రజల పనులకు నేను ఎప్పుడైనా అడ్డుపడ్డానా?
మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజల కోసం చేసిన ఏ పనికైనా తాను అడ్డుగా నిలిచానా అని ప్రశ్నించారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా, జిల్లా అధ్యక్షుడిగా ప్రజలకు సేవ చేయడమే తన బాధ్యత అన్నారు. వ్యక్తిగత ఆరోపణలు కాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు.
🔸 సీఎం జోలికి వస్తే ఊరుకునేది లేదు
ముఖ్యమంత్రి పేరును అనవసరంగా ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేతలపై ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఇకపై తన పేరును ప్రస్తావించే ముందు ఆరోపణలకు ఆధారాలు సిద్ధంగా ఉంచుకోవాలని వజ్రేష్‌యాదవ్‌ ఘాటుగా హెచ్చరించారు.
🔸 ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం
తనపై చేసిన ఆరోపణలను ఒక్కొక్కటిగా నిరూపించాలని, లేకపోతే ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజల సమస్యలపై పోరాడాలని హితవు పలికారు. భూకబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని వజ్రేష్‌యాదవ్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,జిల్లా ఉప అధ్యక్షుడు గౌడవెల్లి బాల్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు చాప రాజు,నక్క సందీప్ గౌడ్,మల్లేష్ గౌడ్, మున్సిపల్ ఛైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, నాయకులు రాఘవేందర్ గౌడ్,జైపాల్ రెడ్డి,మహేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!