🔸రాజేంద్రనగర్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు.. ముగ్గురు అరెస్ట్
ఆర్.జె.న్యూస్,హైదరాబాద్ : మెఫెంథెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఫలక్‌నుమాలోని నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 110 మెఫెంథెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వైయల్స్, 25 సిరంజిలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
🔸ఇండియామార్ట్ ద్వారా కొనుగోలు
పోలీసుల విచారణలో నిందితులు ఇండియామార్ట్ ద్వారా తక్కువ ధరకు ఇంజెక్షన్లను ఆర్డర్ చేసినట్లు వెల్లడైంది. సుమారు రూ.5 వేలకే 30 ఇంజెక్షన్ల ప్యాక్‌ను కొనుగోలు చేసి, ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.1,000 చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
🔸రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి ప్రధాన సరఫరాదారు
రాజస్థాన్‌కు చెందిన శుభమ్ రాజ్‌పుత్ ఈ ఇంజెక్షన్లకు ప్రధాన సరఫరాదారుగా ఉన్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్ జుబేర్ సూచనల మేరకు సైఫ్ ఖాన్ ఇంజెక్షన్లను సరఫరా చేయగా, ఐజాజ్ వాటిని విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. అరెస్టయిన ఐజాజ్‌పై గతంలో ఐదు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
🔸కేసు నమోదు
ఈ ఘటనపై ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 425/2026 నమోదు చేశారు. BNSతో పాటు Drugs & Cosmetics Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
🔸టాస్క్‌ఫోర్స్ బృందానికి సీపీ అభినందనలు
అదనపు డీసీపీ కె.ఎస్. రావు పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఇన్‌స్పెక్టర్ రవి, ఎస్‌ఐ ధర్మేష్, పీసీ కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముఠాను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ బృందాన్ని హైదరాబాద్ సీపీ అభినందించారు. అక్రమ మందులు, మాదకద్రవ్యాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్ 112కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

