🔸సైబర్ మాయగాళ్ల వలలో పడొద్దు..
🔸విద్యార్థులకు సీఐ గురువయ్య గౌడ్ హెచ్చరిక
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఒక చిన్న పొరపాటు.. ఒక అనుమానాస్పద లింక్‌పై క్లిక్.. ఒక ఓటీపీ షేర్.. అంతే క్షణాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని జీనోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ హెచ్చరించారు. సైబర్ మాయగాళ్ల కొత్త ఎత్తుగడలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.జీనోమ్ వ్యాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మజీద్‌పూర్ శ్రీ చైతన్య స్కూల్లో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించారు.తెలియని లింక్‌కు క్లిక్ చేస్తే చిక్కుల్లో పడే అవకాశం ఉందని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని స్పష్టం చేశారు.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా యువత సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్లో కనిపించే ప్రతి ఆఫర్ నిజం కాదని, ఆశ చూపే మాయమాటల వెనుక మోసగాళ్ల ఉచ్చు ఉండవచ్చని హెచ్చరించారు.అనంతరం ట్రాఫిక్ భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై కూడా విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాలకు ఒకసారి బానిసైతే జీవితమే అంధకారమవుతుందని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సురక్షిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని తెలిపారు.అప్రమత్తతే సైబర్ మోసాలకు అసలైన కవచం అంటూ విద్యార్థులు, యువత సురక్షితమైన ఆన్లైన్ విధానాలను పాటించాలని సీఐ గోపగాని గురువయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.
ఒక్క OTP చెప్పారా.. ఖాతా ఖాళీ!
RELATED ARTICLES
