మేడ్చల్‌లో 9 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు తీర్పు
రూ.13,400 జరిమానా.. ఐదుగురికి జైలు శిక్ష
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి మేడ్చల్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 9 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను గురువారం మేడ్చల్‌లోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, 7వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం విచారణ అనంతరం నిందితులకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.మొత్తం 9 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నిందితులకు కలిపి రూ.13,400 జరిమానా విధించారు. అంతేకాకుండా ఐదుగురికి సాధారణ జైలు శిక్ష ఖరారు చేశారు.వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తికి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించగా, మరో నలుగురికి చెరో రెండు రోజుల చొప్పున సాధారణ జైలు శిక్ష పడింది.మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.మద్యం తాగి వాహనం నడిపితే జరిమానాలతోనే సరిపోదని.. జైలు శిక్ష కూడా తప్పదని పోలీసులు స్పష్టం చేశారు. రోడ్లపై బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
