ఎనిమిది ఇళ్లలో చోరీలు.. మరోచోట చైన్ స్నాచింగ్‌కు యత్నం | తాళం వేసిన ఇళ్లే టార్గెట్
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. తాళం వేసి కొద్దిసేపు బయటకు వెళ్లినా ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతుండటంతో బస్తీవాసుల్లో ఆందోళన నెలకొంది. రాజీవ్ గృహకల్ప, ఆల్విన్ కాలనీ ఫేజ్-1, ఉమాదేవి నగర్, పీపీ నగర్, ప్రకాశం పంతులు నగర్, షిరిడి హిల్స్, ఆస్బెస్టాస్ కాలనీ తదితర ప్రాంతాల్లో కొద్దిరోజుల వ్యవధిలో ఎనిమిది చోరీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో వాకింగ్‌కు వెళ్లిన మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును బైక్‌పై వచ్చిన వ్యక్తి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం
ఇళ్లకు తాళాలు వేసి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడాన్ని గమనిస్తున్న దుండగులు.. అదును చూసి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి, అరుణాచలం దేవాలయాల దర్శనానికి ఓ కుటుంబం వెళ్లిన సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి 14 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.4 లక్షల నగదు అపహరించారు. ఆల్విన్ కాలనీలో ఓ మహిళ భోజనం చేసి వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ఇంట్లోకి చొరబడిన దుండగులు 7.25 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. పీపీ నగర్‌లో 50 తులాలకు పైగా వెండి పట్టీలు, 64 గ్రాముల బంగారం చోరీకి గురైంది. షిరిడి హిల్స్‌లో అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న వ్యక్తిని బెదిరించి మరీ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం.
పట్టపగలే చైన్ స్నాచింగ్‌కు యత్నం
సాయిగ్రామం కాలనీలో 56 ఏళ్ల మహిళ వాకింగ్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన మహిళ ప్రతిఘటించడంతో దుండగుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
రూ.58 లక్షల వరకు నష్టం
ఈ వరుస ఘటనల్లో మొత్తం 31.75 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 2.5 కిలోల వెండి, రూ.4.60 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు చోరీకి గురైనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మొత్తం సొత్తు విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం సుమారు రూ.58 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు
బాధితుల ఫిర్యాదుల మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సీఐ సురేష్ తెలిపారు. అనుమానితుల కదలికలు, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ప్రయాణాలకు వెళ్లే సమయంలో ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
