Tuesday, October 6, 2026
Homeమేడ్చల్ జిల్లానాలుగేళ్లుగా నెరవేరని హెచ్‌ఎండీఏ హామీలు.. రోడ్డెక్కిన...

నాలుగేళ్లుగా నెరవేరని హెచ్‌ఎండీఏ హామీలు.. రోడ్డెక్కిన మేడిపల్లి హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ వాసులు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : సొంతింటి కలతో ప్లాట్లు కొనుగోలు చేసి నాలుగేళ్లు గడుస్తున్నా.. లేఅవుట్‌లో కనీస మౌలిక వసతులు అందుబాటులోకి రాకపోవడంతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ ప్లాట్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబాలతో కలిసి ఆదివారం రోడ్డెక్కారు. మేడిపల్లి హెచ్‌ఎండీఏ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో లేఅవుట్‌లో సమావేశమై, ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్‌ వరంగల్‌ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలి.. హెచ్‌ఎండీఏ అధికారులు సమస్యలు పరిష్కరించాలి’ అంటూ నినాదాలు చేశారు.

విద్యుత్‌ లేకుండా ఇళ్ల నిర్మాణం ఎలా?

ఈ సందర్భంగా ప్లాట్ల యజమానులు మాట్లాడుతూ.. లేఅవుట్‌లో విద్యుత్‌ సౌకర్యం లేకుండా ఇళ్ల నిర్మాణం ఎలా చేపట్టాలని ప్రశ్నించారు. నాలుగేళ్లు కావస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

అప్రోచ్‌ రోడ్డు, పార్కులపై నిర్లక్ష్యం

సీపీఆర్‌ఐ–పర్వతాపూర్‌ మధ్య 60 అడుగుల అప్రోచ్‌ రోడ్డు సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేఅవుట్‌లోని పార్కుల చుట్టూ కాంపౌండ్‌ వాల్స్‌, గేట్లు ఏర్పాటు చేయడంతోపాటు గ్రీనరీని అభివృద్ధి చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకు, సంపుల నిర్మాణ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. విద్యుత్‌, రహదారులు, తాగునీరు, పార్కులు తదితర మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించాలని కోరారు.

6న హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద ఆందోళన

ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే అక్టోబర్‌ 6న అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం వద్ద కుటుంబాలతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ప్లాట్ల యజమానులు హెచ్చరించారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎంపల్లి పద్మారెడ్డి, ఈదునూరి హేమంత్‌కుమార్‌, సతీష్‌, సురేష్‌నాయక్‌, రమణారెడ్డి, డీఎస్‌ నాయక్‌, అశోక్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, హనుమాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!