🔸ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతుల వర్షం
🔸పాఠశాలకు వాలీబాల్ నెట్ అందజేసిన చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని అలియాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలను శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. విజేతలకు చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి బహుమతులు అందజేసి అభినందించారు. పాఠశాల విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు వాలీబాల్ నెట్‌ను కూడా అందజేశారు. విద్యార్థులు క్రీడల్లో మరింతగా రాణించి పాఠశాలకు, అలియాబాద్ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. చదువుతో పాటు ప్రతి విద్యార్థి క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ దేశానికి అందించిన సేవలు, సాధించిన విజయాలు యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ టి. వేణుగోపాల్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పీఈటీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

