ఆర్ జె న్యూస్ ,మేడ్చల్ జిల్లా, మేడిపల్లి :
వ్యాపార వివాదం కారణంగా అర్ధరాత్రి ఓ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బొమ్మ తుపాకీతో కుటుంబ సభ్యులను బెదిరించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం బోడుప్పల్‌కు చెందిన చిత్తరంజన్ బిశ్వాస్కు ఏడాది క్రితం క్లౌడ్ కిచెన్ వ్యాపారం ద్వారా అనిల్ కుమార్(40), అతని భార్య సుమన్(37)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి అనిల్ కుమార్ ఫోన్లో చిత్తరంజన్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. అనంతరం రాత్రి 1 గంట సమయంలో చిత్తరంజన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. రెండో అంతస్తుకు చేరుకుని తలుపు బలవంతంగా తెరిచి బొమ్మ తుపాకీ చూపిస్తూ చంపేస్తానని బెదిరించాడు. ఇంతలో సుమన్ కూడా ఇంట్లోకి వచ్చి ఫిర్యాదుదారుతో పాటు కుటుంబ సభ్యులను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులైన అనిల్ కుమార్, సుమన్‌ను అరెస్ట్ చేసి ఘటనలో ఉపయోగించిన బొమ్మ తుపాకీ, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత విభేదాలను చట్టపరమైన మార్గంలోనే పరిష్కరించుకోవాలని, అక్రమ ప్రవేశం, బెదిరింపులు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ జలేందర్ రెడ్డి హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
బొమ్మ తుపాకీతో ఇంట్లోకి చొరబడి బెదిరింపులు..! వ్యాపార వివాదం.. భార్యాభర్తల అరెస్ట్
RELATED ARTICLES
