హెల్మెట్ లేని వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు.. 24 గంటల్లో తిరిగి అప్పగించాలి
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్-1 డీసీపీ కె. రాహుల్ రెడ్డి చొరవతో మంగళవారం అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐజీ విగ్రహం వద్ద హెల్మెట్ బ్యాంకును ప్రారంభించారు. తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ జి. శంకర్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వాహనదారులు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి సంబంధిత పత్రాలను సమర్పించి ఉచితంగా హెల్మెట్ పొందవచ్చని ఏసీపీ తెలిపారు. హెల్మెట్ తీసుకున్న వారు 24 గంటల్లోగా సొంతంగా హెల్మెట్ కొనుగోలు చేసి, పోలీసుల వద్ద తీసుకున్న హెల్మెట్‌ను తిరిగి బ్యాంకుకు అప్పగించాలని సూచించారు. తద్వారా మరికొందరు వాహనదారులకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.ఈ కార్యక్రమం కోసం 150 హెల్మెట్లను విరాళంగా అందించిన వాల్యూ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ అంజని, ప్రతినిధి నితిన్‌లకు అల్వాల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. పవన్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే మూడు నెలల క్రితం గోపాలపురం, బేగంపేట, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రారంభించిన హెల్మెట్ బ్యాంకులకు మంచి స్పందన రావడంతో అల్వాల్‌లోనూ ఈ కార్యక్రమాన్ని విస్తరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్వాల్ ట్రాఫిక్ అదనపు ఇన్‌స్పెక్టర్ జి. జనకిరాములు, బేగంపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసులు, అదనపు ఇన్‌స్పెక్టర్ డి. ప్రమోద్ కుమార్, తిరుమలగిరి ట్రాఫిక్ అదనపు ఇన్‌స్పెక్టర్ వి. సర్దార్ నాయక్, వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
