🔸తక్కువ తూకం.. అధిక ధరలకు విక్రయాలు నలుగురు ట్రేడర్లపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : బియ్యం ధరల పెరుగుదలను అరికట్టడంతో పాటు అక్రమ వ్యాపార కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కమిషనర్ పౌరసరఫరాల శాఖ ఆదేశాల మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఉప్పల్, బాలానగర్ సర్కిళ్ల పరిధిలోని బియ్యం వ్యాపారుల దుకాణాలు, గోదాముల్లో సహాయ పౌరసరఫరాల అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో తక్కువ తూకంతో బియ్యం విక్రయించడం, అధిక ధరలు వసూలు చేయడం, ఇతర అక్రమ వ్యాపార కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నలుగురు బియ్యం ట్రేడర్లపై సంబంధిత చట్టాల ప్రకారం క్రిమినల్, శాఖాపరమైన చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. బియ్యం వ్యాపారులందరూ ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. వినియోగదారులను మోసం చేసినా, అధిక ధరలకు విక్రయించినా, అక్రమ నిల్వలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బియ్యం నిల్వలు, మార్కెట్‌లో లభ్యత, ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి తెలిపారు.ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అవసరానికి మించి బియ్యం కొనుగోలు చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇకపై పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ విభాగాల అధికారులు సంయుక్తంగా ప్రతిరోజూ తనిఖీలు నిర్వహించనున్నారు. అధిక నిల్వలు, అధిక ధరల విక్రయాలు, ధరల పట్టిక నిర్వహణలో నిర్లక్ష్యం వంటి ఉల్లంఘనలకు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

