🔸పందెం డబ్బులతో జూదం.. ముగ్గురు అరెస్ట్.. మరో ముగ్గురు పరార్
ఆర్ జె న్యూస్, జవహర్‌నగర్ : గోశాల సమీపంలో బహిరంగంగా మూడు ముక్కలాట ఆడుతున్న వారిపై జవహర్‌నగర్ పోలీసులు దాడి చేశారు. పందెం డబ్బులతో జూదం ఆడుతున్న ఆరుగురిని పోలీసులు గుర్తించగా.. పోలీసులను చూసి ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం. సెప్టెంబర్ 22న రాత్రి 7.15 గంటల సమయంలో జవహర్‌నగర్ గోశాల సమీపంలో కొందరు డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్నారనే సమాచారం ఎస్‌ఐ కె.రమేష్‌కు అందింది. దీంతో పోలీసు సిబ్బందితో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు. ఆరుగురు వ్యక్తులు జూదం ఆడుతూ కనిపించగా.. పోలీసులను గమనించిన రవి, నాగరాజు, రాజు పరారయ్యారు.
అక్కడే ఉన్న పిట్టల బాలయ్య (48), ఎర్రగుంట రాజు (32), దేవరుప్పుల మహేష్ (45)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు సెట్ల ప్లేయింగ్ కార్డులు, రూ.6,950 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.20 వేలుగా పోలీసులు తెలిపారు.పరారైన రవి, నాగరాజు, రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
