🔸సుభాష్‌నగర్‌లో పంజాబ్ రేషన్ గోధుమల నిల్వలు స్వాధీనం
🔸 51 సంచుల గోధుమలు సీజ్..
🔸 నిందితుడు రమేష్ అగర్వాల్ అరెస్ట్
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : సుభాష్‌నగర్‌లో అక్రమంగా గోధుమపిండి తయారు చేసి ప్రముఖ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేస్తున్న వ్యవహారంపై పోలీసులు కొరడా ఝళిపించారు. స్వేచ్ఛ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన పోలీసులు జీడిమెట్ల పరిధిలోని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి సుభాష్‌నగర్‌లో ఉన్న గోధుమపిండి గోదాంపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పంజాబ్ రాష్ట్ర సివిల్ సప్లై గోధుమలుగా గుర్తించిన 51 సంచులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ బ్రాండ్ల ముసుగులో ప్యాకింగ్!
సుభాష్‌నగర్‌కు చెందిన రమేష్ అగర్వాల్ (40) అక్రమంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రేషన్ గోధుమలను పిండి పట్టించి, పలు ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ఉన్న కవర్లలో ప్యాకింగ్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ పిండిని హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తూ లక్షల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సివిల్ సప్లై అధికారులకు సమాచారం
దాడుల్లో స్వాధీనం చేసుకున్న 51 గోధుమల సంచులకు సంబంధించి పోలీసులు సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రభుత్వ రేషన్ గోధుమలు అక్రమంగా వ్యాపార అవసరాలకు మళ్లించారా? ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
