🔸నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి: రామన్నగారి రాఘవేంద్ర గౌడ్
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : కీర్తిశేషులు వల్లూరి ప్రమోద్ ఆశయం మేరకు శ్రీనివాస్ నగర్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆర్.ఆర్. ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ తెలిపారు. మంగళవారం కాలనీలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత ప్రమాణాల ప్రకారం నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.ఈ సందర్భంగా తన ఆప్తమిత్రుడు, ఆర్.ఆర్. ఫౌండేషన్ సభ్యుడు కీర్తిశేషులు వల్లూరి ప్రమోద్ సేవలను ఆయన స్మరించుకున్నారు. శ్రీనివాస్ నగర్, సూర్యనగర్, ఆర్టీసీ కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రమోద్ ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకొచ్చేవారని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేసేవారని గుర్తుచేసుకున్నారు. ప్రమోద్ చూపిన చొరవ, పట్టుదల ఫలితంగానే నేడు శ్రీనివాస్ నగర్‌లో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం సాధ్యమైందన్నారు.కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ఆర్.ఆర్. ఫౌండేషన్ కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో శ్రీనివాస్ నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, రోడ్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి నరసింహ, కాంగ్రెస్ నాయకులు కటిక వినయ్, నరసింహారెడ్డి, కాలనీవాసులు రాహుల్, ఎన్.కె. నాయుడు, భీమ్ రెడ్డి, శైలేందర్ జా, ఆర్.ఆర్. ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

