🔸29.2 తులాల బంగారం, 27 తులాల వెండి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
🔸ప్రధాన నిందితుడు పరారీ.. మరో నిందితుడి కోసం గాలింపు
ఆర్ జె న్యూస్ , మేడ్చల్ : అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జానకీనగర్‌లో గత శనివారం రాత్రి జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్వాల్ ఏసీపీ రమేష్ వెల్లడించారు. బాధితులు ఇంటికి తాళం వేసి సాయంత్రం దమ్మాయిగూడలోని బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు 112 ద్వారా సమాచారం అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు.
అల్వాల్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించినట్లు ఏసీపీ వివరించారు. దార్ల నెహెమయ్య అలియాస్ బ్రూస్లీ, నితిన్ ఫ్రాన్సిస్ కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు.ఈ క్రమంలో రెండో నిందితుడైన నితిన్ ఫ్రాన్సిస్‌ను బేగంపేటలోని బాలంరాయ్ ఎక్స్‌రోడ్స్ వద్ద అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రమేష్ మీడియాకు తెలిపారు. ప్రధాన నిందితుడు దార్ల నెహెమయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు.కేసును ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అల్వాల్ పోలీసులను ఏసీపీ అభినందించారు.
