మేడ్చల్, జూలై 7 ( ఆర్ జె న్యూస్) :
సెంట్రల్ డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తవ్విన రహదారిని ఏడాది గడిచినా పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలకు, రైల్వే స్టేషన్‌కు, పలు గ్రామాలకు అనుసంధానంగా ఉన్న ఈ ప్రధాన రహదారి ప్రస్తుతం భారీ గుంతలు, బురదతో ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి ద్వారా ప్రతిరోజూ ఎమ్మార్వో కార్యాలయం, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, ప్రభుత్వ గ్రంథాలయం, రైల్వే స్టేషన్‌తో పాటు సమీప గ్రామాలకు వెళ్లే వేలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. అయితే డ్రైనేజీ పనుల కోసం తవ్విన అనంతరం రోడ్డును పునరుద్ధరించకపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారీ గుంతల్లో నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు జారి పడుతూ గాయాల పాలవుతుండగా, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలు కూడా తీవ్రంగా ఇబ్బందికరంగా మారాయి.
స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారిపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సమస్య మరింత తీవ్రమవుతోందని, ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
