🔸18 నూతన దరఖాస్తులు..
🔸12 రెన్యువల్ దరఖాస్తుల పరిశీలన
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గర్భస్థ శిశు లింగ నిర్ధారణను అరికట్టడంతో పాటు పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదంతో ఏర్పాటైన జిల్లా పీసీ అండ్ పీఎన్‌డీటీ సలహా కమిటీ సమావేశం శుక్రవారం అంతాయిపల్లిలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది.అల్ట్రాసోనోగ్రఫీ కేంద్రాలు, జన్యు సలహా కేంద్రాలు, జన్యు ప్రయోగశాలలు, ఇమేజింగ్ కేంద్రాల ఏర్పాటుకు వచ్చిన 18 నూతన దరఖాస్తులను, ఇప్పటికే కొనసాగుతున్న కేంద్రాల రెన్యువల్‌కు సంబంధించిన 12 దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. ఆయా సంస్థలకు అనుమతులు మంజూరు చేయడం, రెన్యువల్ ప్రక్రియ చేపట్టడం వంటి అంశాలను పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్ట నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి పారదర్శకంగా నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వైద్య సంస్థల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తూ చట్టవిరుద్ధంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ కె. ఆనంద్ మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణను నిరోధించడం, ఆడ శిశువుల సంరక్షణకు భరోసా కల్పించడం, వైద్య రంగంలో చట్టబద్ధమైన, నైతిక ప్రమాణాలను కాపాడటం వైద్యారోగ్యశాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్ట నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వైద్య సంస్థల అనుమతులు, రెన్యువల్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు శాఖ కట్టుబడి ఉందన్నారు.సమావేశంలో జిల్లా స్థాయి సలహా కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
