Saturday, October 3, 2026
Homeమేడ్చల్ జిల్లాప్రపంచ పర్యాటక దినోత్సవం.. విద్యార్థుల ప్రతిభకు...

ప్రపంచ పర్యాటక దినోత్సవం.. విద్యార్థుల ప్రతిభకు వేదిక

📰 Generate e-Paper Clip

🔸మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లాలో వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రపంచ పర్యాటక దినోత్సవం-2026 సందర్భంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని యువ టూరిజం క్లబ్బుల విద్యార్థులకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించారు. ‘డిజిటల్‌ ఎజెండా అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టు రీడిజైన్‌ టూరిజం’ అంశంపై నిర్వహించిన పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పర్యాటక రంగంలో యువత పాత్ర కీలకం

విద్యార్థుల్లో పర్యాటక రంగంపై అవగాహన పెంపొందించడంతో పాటు సృజనాత్మకతను వెలికితీయడమే పోటీల ఉద్దేశమని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో పర్యాటక రంగ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలోని కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, శామీర్‌పేట చెరువు, కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కు, జీనోమ్‌ వ్యాలీతో పాటు పలు ప్రముఖ ఆలయాలు హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని అదనపు కలెక్టర్‌ ఫైజన్‌ అహ్మద్‌ తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జిల్లా పర్యాటక అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నేరేడ్‌మెట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, వివిధ జిల్లా పరిషత్‌ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కాన్వాస్‌ పెయింటింగ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 9, 10వ తరగతి విద్యార్థులు పర్యావరణం, పర్యాటకం తదితర అంశాలపై రూపొందించిన చిత్రాలు ప్రశంసలు అందుకున్నాయి.జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చిత్రకళ రూపంలో రూపొందించి రాష్ట్రస్థాయి ఆర్ట్‌ గ్యాలరీల్లో ప్రదర్శించేలా విద్యార్థులకు తగిన శిక్షణ అందించాలని అదనపు కలెక్టర్‌ సంబంధిత ప్రిన్సిపాల్‌కు సూచించారు.

బహుమతులు, సర్టిఫికెట్ల ప్రదానం

పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు అదనపు కలెక్టర్‌ ఫైజన్‌ అహ్మద్‌ చిత్రపటాన్ని స్వయంగా గీసి ఆయనకు బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం నోడల్‌ అధికారి సాంబశివరావు, జిల్లా విద్యాధికారి రేణుక, ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కిషన్‌, టూరిజం అధికారి దామోదర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శివప్రసాద్‌, డీపీఎం అభిలాష్‌రావు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!