ఆర్ జె న్యూస్, హైదరాబాద్ :
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలని చరిత్రక ముషీరాబాద్ మహంకాళి ఆలయ ప్రధాన అర్చకుడు చంద్ర మౌళి అన్నారు. శనివారం నిజామాబాద్‌కు చెందిన భక్తుడు శివకుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముషీరాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఐదు తులాల బంగారు ఆభరణాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశానని, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్తున్న సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు. అమ్మవారి కరుణతో తన జీవితంలో మంచి అవకాశం లభించిందని, అందుకే కుటుంబంతో కలిసి వచ్చి కానుక సమర్పించినట్లు పేర్కొన్నారు. శివకుమార్‌ను ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి శివకుమార్ కుటుంబానికి అమ్మవారి ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.
