🔸కారుకు పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!
🔸బౌరంపేట్‌లో కాంగ్రెస్ నేత వీరారెడ్డిని టార్గెట్ చేశారా?
🔸ముందుగా రెక్కీ.. ఆపై దాడి యత్నం?
🔸 వ్యాపార వివాదమా.. రాజకీయ కక్షలా..?
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారవేత్త నర్సారెడ్డి వీరారెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించారా? అనే అనుమానాలు కలకలం రేపుతున్నాయి. బౌరంపేట్లోని తన కార్యాలయంలో వీరారెడ్డి ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అనుమానాస్పదంగా సంచరించి, అనంతరం ఆయనకు చెందిన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం.
ఘటనకు ముందు దుండగులు కార్యాలయం పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా ప్రణాళికతోనే కార్యాలయం వద్దకు చేరుకున్న వారు కారుకు నిప్పంటించి భారీ ప్రమాదానికి యత్నించారా? లేక కేవలం ఆస్తి ధ్వంసమే లక్ష్యమా? అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది.
కారులో నుంచి మంటలు ఎగసిపడుతున్నట్లు గమనించిన వీరారెడ్డి వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు.ఈ ఘటన వెనుక వ్యాపార లావాదేవీల వివాదం ఉందా? రాజకీయ కక్షలే కారణమా? లేక వ్యక్తిగత శత్రుత్వంతోనే దాడికి యత్నించారా? అనే పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న వెంటనే బాచుపల్లి సీఐ డాల్ నాయుడు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ, ఇతర సాక్ష్యాధారాలను సేకరించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.అయితే, ఈ ఘటనను పోలీసులు అధికారికంగా హత్యాయత్నంగా నిర్ధారించాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయితేనే దాడి వెనుక అసలు కారణాలు, నిందితుల లక్ష్యం బయటపడే అవకాశం ఉంది.
