♦️గుడ్ల నిల్వ లేకపోవడంపై ఆరా..
♦️పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం వద్దని ఆదేశం
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తుర్కపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (బాలుర వసతి గృహం)ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ఆనంద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య రికార్డులు, మందుల నిల్వ, వంటశాల, వసతి గృహంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసిన ఆయన.. వంటకు ఉపయోగిస్తున్న కూరగాయల నాణ్యత, ఆహార పదార్థాల నిల్వ విధానం, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థులకు తాజాగా, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు.తనిఖీ సందర్భంగా విద్యార్థులకు అందించాల్సిన గుడ్ల నిల్వ లేకపోవడాన్ని గుర్తించిన డా. ఆనంద్.. ప్రభుత్వం నిర్దేశించిన పోషకాహారం ఎలాంటి అంతరాయం లేకుండా అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హాస్టల్ సామర్థ్యం 783 మంది కాగా, ప్రస్తుతం 679 మంది విద్యార్థులు నివాసం ఉంటున్నట్లు వెల్లడైంది. వంటశాల నిర్వహణ, ఆహార నాణ్యత, పరిశుభ్రత, హాస్టల్ పరిసరాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్న ఆయన.. అవసరమైతే ఆర్బీఎస్కే వైద్య బృందాలతో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైన విద్యార్థులను సమీప తుర్కపల్లి లేదా శామీర్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
