Friday, August 14, 2026
Homeమేడ్చల్ జిల్లాపోలీస్‌ ఉద్యోగాల్లో మేడ్చల్‌ యువతకు న్యాయం...

పోలీస్‌ ఉద్యోగాల్లో మేడ్చల్‌ యువతకు న్యాయం చేయాలి

ఆర్.జే.న్యూస్, మేడ్చల్‌ : పోలీస్‌ ఉద్యోగ నియామకాల్లో మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం విధానపరమైన మార్పులు చేపట్టాలని మేడ్చల్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో సివిల్‌, ఏఆర్‌ పోస్టులను జనాభా, పోలీస్‌స్టేషన్ల అవసరాలు, ఖాళీల ఆధారంగా భర్తీ చేయాలని కోరారు. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా జనాభా పరంగా పెద్దదైనందున పోలీస్‌స్టేషన్లు, సిబ్బంది అవసరం కూడా అధికంగా ఉందన్నారు. అయినప్పటికీ పోలీస్‌ పరిధుల కారణంగా ఇతర జిల్లాల అభ్యర్థులు పోటీ చేయడంతో స్థానిక యువతకు అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉండటంతో నియామకాల్లో స్థానికతపై ప్రభావం పడిందన్నారు. ప్రస్తుతం మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటైన నేపథ్యంలో పోలీస్‌ నియామకాల్లో జిల్లా ప్రాతిపదికన స్థానిక యువతకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా నిబంధనలను పునఃపరిశీలించాలని కోరారు. ఎస్‌ఐ నియామకాల్లో అమలవుతున్న జోనల్‌ విధానాన్ని కూడా ప్రభుత్వం పునఃపరిశీలించాలని సుదర్శన్‌రెడ్డి సూచించారు. భౌగోళిక, పరిపాలనా పరిస్థితులకు అనుగుణంగా జోన్లను పునర్వ్యవస్థీకరించి మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాల్లో సముచిత వాటా కల్పించాలని డిమాండ్‌ చేశారు.స్థానిక యువత ప్రయోజనాలను కాపాడేలా పోలీస్‌ కమిషనరేట్‌లు, జోన్ల పరిధులను పునఃపరిశీలించాలని, ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లాల తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!