ఆర్.జె.న్యూస్,మేడ్చల్ జిల్లా : బొమ్మరాసిపేట రైతుల భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం శామీర్‌పేట్ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఆందోళనకు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ.. బొమ్మరాసిపేట రైతుల భూములను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అండతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు భూ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించాల్సి ఉంటే అధికారికంగా వివరణ ఇవ్వాలని, మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
🔸రాష్ట్రంలోనే భారీ భూ కుంభకోణం
బొమ్మరాసిపేట భూముల వ్యవహారం రాష్ట్ర చరిత్రలోనే భారీ భూ కుంభకోణంగా మారుతోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి లావాదేవీలను నిలిపివేయడంతో వారు తమ భూములను విక్రయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొన్ని భూములకు సంబంధించి నకిలీ పత్రాలు, రికార్డులు సృష్టించారన్న ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు.
🔸రైతులకు న్యాయం చేయాలి
భూములపై ఉన్న ఆంక్షలను తొలగించి రైతులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రెవెన్యూ రికార్డులు, గతంలో జరిగిన విచారణలు, అధికారుల ఆదేశాలను పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల భూములను కాపాడేందుకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, బొమ్మరాసిపేట భూ బాధిత రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
