ఆర్ జె న్యూస్, హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి, అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య పురోగతిపై సమగ్ర సమాచారం తీసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి వారికి ధైర్యం చెప్పారు. ఆయనకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవల్లోకి రావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, ఆయన మరోసారి ప్రజల మధ్యకు రావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
