Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లాఅంగవైకల్యం అడ్డుకాలేదు.. పోలీస్ కావాలన్న రాహుల్...

అంగవైకల్యం అడ్డుకాలేదు.. పోలీస్ కావాలన్న రాహుల్ కల సాకారం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా :- శారీరక వైకల్యం ఉన్నా, మనసులోని ఆశయాన్ని ఎవరూ అడ్డుకోలేరని దమ్మాయిగూడకు చెందిన రాహుల్ నిరూపించాడు. చిన్నప్పటి నుంచే పోలీస్ అధికారిగా మారాలన్న కలతో ఉన్న రాహుల్‌కు ఆ కలను ఒకరోజైనా నిజం చేసే అవకాశం కల్పించి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి మానవత్వాన్ని చాటారు. పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న రాహుల్‌ను కమిషనరేట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించిన సీపీ సుమతి, తన కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ టోపీ ధరింపజేశారు. అధికారిగా వ్యవహరించే అనుభూతిని కలిగించి అతని జీవితంలో చిరస్మరణీయ క్షణాలను అందించారు. ఈ దృశ్యాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేశాయి. అంతేకాకుండా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాహుల్‌కు వీల్‌చైర్‌ను అందజేశారు. దీంతో అతని రోజువారీ జీవనం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ, సమాజంలో వికలాంగులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచి వారి కలలను ప్రోత్సహించాలని, సేవాభావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం మరింత మానవీయంగా మారుతుందని పేర్కొన్నారు. రాహుల్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ కుమారుడి చిరకాల కోరికను నెరవేర్చిన సీపీ సుమతికి, ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కలలకు అంగవైకల్యం అడ్డంకి కాదు… అవకాశం లభిస్తే ప్రతిభ, ఆత్మవిశ్వాసం వికసిస్తాయనే సందేశాన్ని రాహుల్ కథ మరోసారి సమాజానికి గుర్తు చేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!