హనుమకొండ ఆర్ జె న్యూస్ జూలై 2 :
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 53వ డివిజన్ పరిధిలో లష్కర్ నగర్ సింగారం, గోపాల్పూర్ జంక్షన్ ప్రాంతాల్లో రూ.2.10 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో డివిజన్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించేవారని, ప్రస్తుతం ఒక్కో డివిజన్‌కు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి కాలనీకి మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు.
సంక్షేమంపై స్పష్టత
గతంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలను డివిజన్ వారీగా తుది దశకు తీసుకువచ్చామన్నారు.
లంచాలపై హెచ్చరిక
రేషన్ కార్డులు, పెన్షన్లు లేదా ఇతర ప్రభుత్వ పథకాల కోసం ఎవరైనా రాజకీయ నాయకులు లేదా అధికారులు డబ్బులు అడిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు సంబంధించిన ప్రతి పథకం ఉచితమేనని, మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారుల చేతికే నేరుగా ప్రయోజనాలు చేరే విధంగా వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు.
విమర్శలపై సవాల్
అభివృద్ధిపై చర్చకు తాము ఎప్పుడూ సిద్ధమేనని, కానీ ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. విమర్శలు చేసే ముందు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తాము చేసిన పనులు చెప్పాలని సవాల్ విసిరారు.వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే భూసేకరణ కోసం వందల కోట్లు వెచ్చించి కేంద్రానికి భూమి అప్పగించిందని, అయినా కేంద్రం అభివృద్ధిని వేగవంతం చేయలేదని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీజేపీ వరంగల్‌కు ఎయిర్పోర్ట్ పూర్తి చేయలేదని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిపై చర్చించకుండా అనవసర రాజకీయ విమర్శలకు పాల్పడుతున్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ
అనంతరం స్థానికంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
