ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ నెలలోగా పేద ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు ఆస్పత్రి సిద్ధమవుతుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెల్లడించారు. మంగళవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ అల్వాల్ టిమ్స్ ఆస్పత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు.
🔸 “కొబ్బరికాయ కొట్టింది BRS.. గుమ్మడికాయ కొట్టేది కాంగ్రెస్”
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “BRS హయాంలో అల్వాల్ టిమ్స్‌కు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే యుద్ధ ప్రాతిపదికన 85 శాతం పనులు పూర్తి చేసింది. త్వరలో గుమ్మడికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తాం” అని అన్నారు.
🔸 687 కోట్లతో అత్యాధునిక సదుపాయాలు
BRS హయాంలో కేవలం 14 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.687 కోట్లతో 86 శాతం పనులను వేగవంతంగా పూర్తి చేసిందని ఆయన తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలతో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
🔸 ఉత్తర తెలంగాణకు లబ్ధి
ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ తదితర నగర శివారు ప్రాంతాల పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, పేదలకు నాణ్యమైన వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు.
