ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ, దానంపై అనర్హత వేటు వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
అసలేం జరిగింది?
బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పీకర్, చట్టపరంగా దానం పార్టీ మారలేదంటూ మార్చి 11న తీర్పు ఇచ్చారు.
హైకోర్టులో పిటిషన్లు..
స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపునకు సంబంధించి స్పీకర్‌కు పలు ఆధారాలు సమర్పించినా పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
తుది తీర్పులో హైకోర్టు ఏం చెప్పింది?
పిటిషన్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఇవాళ తుది తీర్పు ఇచ్చింది.
– దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది.
– కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాటి నుంచే అనర్హత వర్తిస్తుందని స్పష్టం చేసింది.
– ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఎన్నికల సంఘానికి (ఈసీ) సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పార్టీ ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్‌గా మారింది.
